హోదా.. గతం గతః

Posted April 12, 2017 (2 weeks ago)

ap special status kept aside by central
జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై హోదా ఊసెత్తొద్దు. ఇది రాజ్యసభలో తెలుగు ఎంపీలకు కేంద్రం ఇచ్చిన ఆన్సర్. పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక హోదాకు తావే లేదని కేంద్రం తేల్చిచెప్పింది. హోదాపై దాగుడుమూతలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అసలు హోదా అనే పదం ఇప్పుుడు ఎగ్జిస్టెన్స్ లో లేదని, ఏపీ కే కాదు, మరే రాష్ట్రానికి ఇచ్చే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టింది. ప్రత్యేక హోదా కోసం కేవీపీ సావధాన తీర్మానం పెట్టగా.. వివిధ పార్టీల ఎంపీలు దాన్ని బలపరిచారు. కానీ కేంద్రం మాత్రం తీర్మానం గాలి తీసేసింది.

హోదా ఎప్పుడిస్తారు. ఎందుకిస్తారు, హోదా కావాలంటే ఏం అర్హతలుండాలి వగైరా లిస్ట్ అంతా చదివిన కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్.. ప్లానింగ్ కమిషన్ రద్దు, ఎన్డీసీ భేటీ తదితర అంశాలను కూడా ప్రస్తావించి సభ్యులను కన్ ఫ్యూజ్ చేశారు. గతంలో పదకొండు రాష్ట్రాలకు హోదా ఇచ్చారని, అయితే వాటన్నింటికీ ఎన్డీసీ ఆమోదం ఉందని తేల్చిచెప్పారు. మన్మోహన్ రాజ్యసభలో ఏపీకి హోదా ఇస్తామని వాగ్దానం చేశారని, ఆ తర్వాత తమ ప్రభుత్వం ఏర్పడటానికి మూడు నెలలు పట్టిందని, ఈ లోగా ఎన్డీసీలో ఎందుకు ఆమోదం తీసుకోలేదని కాంగ్రెస్ ను ఎదురుప్రశ్నించారు.

ఇక కాంగ్రెస్ వైపు నుంచి దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్ బీజేపీని ఇరుకునపెట్టే విధంగా మాట్లాడగా.. సభలో ప్రతిపక్ష నేత ఆజాద్ మాత్రం అయోమయంగా స్పందించారు. ఏపీకి హోదా కోసం తీర్మానం పెడితే.. ఆ రాష్ట్రం గురించి కాకుండా ఇతర రాష్ట్రాల గురించి ఎక్కువ మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వాకౌట్ సమయంలో కూడా ఎందుకు ప్రొటెస్ట్ తెలుపుతున్నారో స్పష్టంగా చెప్పలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యుల్లోనే హోదాపై ఏకాభిప్రాయం లేదన్న సంగతి బట్టబయలైంది. ఇప్పటికే హోదా కోసం ప్రైవేట్ బిల్లు పెట్టి భంగపడ్డ కేవీపీ.. సావధాన తీర్మానం పెట్టినా సేమ్ రిజల్ట్ వచ్చింది. కానీ హోదా వచ్చేవరకూ పోరాడతానంటున్నారు కేవీపీ.

Post Your Coment
Loading...