కేంద్రం న్యాయం చేయడంలేదు ..బాబు ఆవేదన

 babu fell central govt no justice ap
రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులకు పతకాలు ప్రదానం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ ప్రక్షాళన చేస్తామన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ఆస్పత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించే విద్యార్థులకు పరీక్షల్లో అదనపు మార్కులు వేసి ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ వరాన్ని ఇచ్చారు. నాటే ప్రతి మొక్కా ఏ విద్యార్థి నాటాడో రికార్డు చేస్తామని, దాని ఎదుగుదలను జియో ట్యాగింగ్ పద్ధతిలో పరిశీలిస్తూ ఉంటామని, దాన్ని బట్టి సదరు విద్యార్థికి అదనపు మార్కులు కలుపుతామని చంద్రబాబు వివరించారు. చదువుకున్న విద్యార్థులు విదేశాల వైపు చూడకుండా ఇక్కడే మెరుగైన ఉపాధిని కల్పించే సంస్థలను ఆహ్వానిస్తున్నామని వివరించారు.
పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళితే, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటూ సాంకేతికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సి వుందని, ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తానని అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని చూసి ఎన్నో దేశ విదేశీ సంస్థలు రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు. 
రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి కేంద్రం ఏమాత్రం న్యాయం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల కాలంలో ఏపీకి కేంద్రం ఎంతమాత్రం సహకారం అందించలేదన్నారు. ఆర్థిక లోటును భర్తీ చేస్తామన్న హామీని కూడా మోదీ సర్కారు అమలు చేయలేదన్నారు. రెండేళ్లైయినా ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ ఊసే లేదన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY