భద్రం కూతురా!

0
181

Posted October 6, 2016

 bollywood actor farhan akhtar wrote letter his daughter
రేప్‌ గురించి నీకు ఎలా చెప్పాలి? ఒక తండ్రిగా నిన్ను అనుక్షణం కాపాడాలని ఉంటుంది. కానీ ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నీకు 12 ఏళ్లు ఉన్నప్పుడు- నా టీంలో ఒక అమ్మాయిని దారుణంగా చంపేశారు. ఆ సమయంలో నువ్వు చిన్నపిల్లవి కాబట్టి నేను ఈ విషయం చర్చించలేకపోయా. ఇప్పుడు నీకు 16 ఏళ్లు.. అన్ని విషయాల గురించి మాట్లాడాల్సిన సమయం అసన్నమయింది.

నేను, అమ్మ- నీకు అనేక విషయాలు చెప్పాం. అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య తేడా ఉండకూడదన్నాం. అబ్బాయిలకు ఎంత చాయిస్‌ ఉందో అమ్మాయిలకూ అంతే ఉందన్నాం. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ల గురించి చెప్పాం. ఎవరైనా నిన్ను తాకినప్పుడు ఇబ్బందిగా ఉంటే అది బ్యాడ్‌ టచ్‌ అని వివరించాం. ఆ వ్యక్తి మొహం మీదే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పమన్నాం. నీ శరీరంపై నీకు మాత్రమే హక్కు ఉందని.. ఇంకెవ్వరికీ లేదని చెప్పాం. కానీ నీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లు చూస్తుంటే- ఈ ప్రపంచంలో అనేక విషయాలు ఇబ్బంది పెడుతున్నాయని అర్థం అవుతోంది. నాకు నచ్చిన బట్టలు ఎందుకు వేసుకోకూడదు? నేను స్వేచ్ఛగా ఎందుకు ఉండకూడదు? లాంటి అనేక ప్రశ్నలు సంధిస్తున్నావు. మన చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచంలోని పరిస్థితులు నీకు చెప్పాలి.
 
మనం భద్రత లేని, సీ్త్ర, పురుషుల మధ్య అసమానతలున్న సమాజంలో బతుకుతున్నాం. నీకు మేము పూర్తి స్వేచ్చను ఇచ్చి ఉండొచ్చు. తలకు నీలం రంగు వేసుకున్నా మేము ఏమీ అని ఉండకపోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆ విధంగా లేదు. నేను పనిచేస్తున్న బాలీవుడ్‌నే తీసుకుందాం. మహిళలను వేధించటం చాలా సామాన్యమైన విషయంగా చూపిస్తాం. చాలా సినిమాల్లో కాలేజీలో అమ్మాయిలను ఏడిపిస్తున్నట్లు చూపిస్తారు. ఆ అమ్మాయి హీరోకి పదే పదే నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెబుతూ ఉంటుంది. కానీ అతను వినకుండా వెంటపడుతూ ఉంటాడు. కొన్ని సినిమాల్లో హీరోకు ఒక బ్యాచ్‌ ఉంటుంది. వాళ్లు హీరోకి సాయం చేయటం కోసం ఆ అమ్మాయిని నానా తిప్పలు పెడుతుంటారు. వాళిద్దరూ కలిసే విధంగా రకరకాల ప్లాన్‌లు వేస్తుంటారు. ఇవన్నీ చాలా సాధారణమైన విషయాలుగా చూపిస్తుంటాం. సినిమాల్లో అమ్మాయిల వెంట పడి వేధించటం అతి సామాన్యమైన విషయం. కేవలం ఇలాంటి వేధింపులు మాత్రమే కాదు.. రేప్‌, లైంగిక వేధింపులు కూడా సినిమాల్లో భాగమైపోయాయి. గతంలో విలన్స్‌ ఎవరో స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు వారి స్థానాన్ని కూడా హీరోలే పూరించేస్తున్నారు. అంతే కాదు- హీరోయిన్‌ కూడా చివరకు- ‘వీడు నన్ను తీవ్రంగా ప్రేమిస్తున్నాడు కాబట్టే నా వెంట పడుతున్నాడు’ అని సమాధానపడి.. అతనినే పెళ్లి చేసుకుంటుంది.
 
నీకు, నాకు మధ్య ఎప్పుడూ కమ్యూనికేషన్‌ గ్యాప్‌ లేదు. అనేక విషయాలను స్వేచ్ఛగా చర్చించుకోగలం. అందుకే నీకు నేను చెప్పేదొకటే.. నీ కలలను సాకారం చేసుకోవటానికి ప్రయత్నించు. నీ జీవితాన్ని స్వేచ్ఛగా బతుకు. అదే సమయంలో భద్రంగా ఉండు. భద్రంగా ఉండటం అంటే ఏమిటో నీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు.. నీ మీద నీకు పూర్తి నియంత్రణ ఉన్నప్పుడు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు..
మీ నాన్న…. 
 
(బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు, గాయకుడు ఫరాన్‌ అక్తర్‌ తన కూతురికి రాసిన ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా తిరుగుతోంది

NO COMMENTS

LEAVE A REPLY