దత్త గ్రామం పై బాబు వరాల జల్లు..

  cm babu giving booms adopting villages

తన స్వీయ దత్తత గ్రామం పెదలబుడుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. నేడు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా పర్యటనలోని ఆయన పెదలబుడులో పర్యటించి, అక్కడి స్థానికులతో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం గ్రామానికి చేరిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మరో పది రోజుల్లో ఇంటింటికీ వంట గ్యాస్ ను పైప్ లైన్ ద్వారా అందిస్తానని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో ప్రతి ఇంటికీ తాగు నీటిని పైప్ లైన్ల ద్వారా అందిస్తామని తెలిపారు.

ఏడాది లోగా 413 ఇళ్లను నిర్మించి ఇస్తామని, గ్రామంలో పక్కా ఇల్లు లేని కుటుంబమే లేకుండా చూస్తానని చెప్పారు. గ్రామానికి ఆలయం, గ్రంథాలయాన్ని మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నిధులతో ఆలయం నిర్మిస్తామని వివరించారు. ప్రతి రోడ్డునూ సిమెంట్ రోడ్డుగా మారుస్తున్నట్టు ప్రకటించారు. పనులు వెంటనే ప్రారంభమవుతాయని, సాధ్యమైనంత త్వరలో పూర్తవుతాయని అన్నారు. అక్కడ జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు, గిరిజనులతో కలసి నృత్యం చేశారు. గిరిజన నృత్యాలకు ప్రాధాన్యత కల్పిస్తామని, కళాకారులకు ఉపాధిని చూపుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న అరకు లోయను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని చంద్రబాబు తెలిపారు.

Post Your Coment
Loading...