ప్రయాణాలే అనుభవాలు.. చిన్నారికి ఓ తండ్రి చివరి లేఖ

father son emotional letterకొడుక్కి ఐదేళ్ల వయసు వచ్చేదాకా గారాబం చేయి… ఆ తర్వాత పదేళ్ల పాటు కఠినంగా వ్యవహరించు.  అవసరమైతే బెత్తం ఉపయోగించు… 16 వ ఏట నుంచి ఓ స్నేహితుడిలా చూడు… ఇదీ పుత్రుల పెంపకం గురించి చాణక్యుడు చెప్పిన నీతి… కానీ ఆ తండ్రికి అంత సమయం ఇవ్వలేదా ఆ మృత్యువు… బిడ్డకి తొమ్మిదేళ్ల వయసొచ్చేసరికి కామెర్ల రూపంలో కబళించింది… ముంచుకొస్తున్న మృత్యువు ఓ వైపు… చిన్నారి బిడ్డ మరోవైపు… చివరి రోజుల్లో వున్నా ఆ తండ్రి భాద్యత మరువలేదు. ఓ గీత రచయితగా తన జీవిత అనుభవాన్ని రంగరించి బిడ్డకి ఓ లేఖ రాశాడు. మనవళ్లతో ఆడుకొనే రోజుల్లో కూడా గుర్తుండేలా అక్షర రత్నాలు కాగితంపై పొదిగాడు. ఆయనే రెండ్రోజుల కిందట చనిపోయిన తమిళ గీత రచయిత ముత్తుకుమార్. ఆయన కొడుక్కి రాసిన లేఖ తెలుగు అనువాదం ఇదే…

‘‘ప్రియమైన కుమారుడికి నాన్న రాస్తున్నది.. ఇది నేను రాసే తొలి లేఖ. దీన్ని చదివి అర్థం చేసుకునే వయసులో నీవు లేవు. భాష వేళ్లు పట్టుకుని.. నడుస్తున్నావ్‌. నా దగ్గర నుంచి మా నాన్న దాచిన రహస్యాల పెట్టె తాళాన్ని నేను వెతికినట్టే.. నువ్వూ వెతుకుతావు. కానీ జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. ఎక్కువగా ప్రయాణాలు చెయ్‌. ఆ ప్రయాణాలే నీకు విలువైన అనుభవాన్నిస్తాయి. పుస్తకాలను ప్రేమించు. ఒక్కో పుస్తకం.. ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. మీ తాత, నాన్న పుస్తకాల ప్రపంచంలోనే కనుమరుగయ్యారు. నీ రక్తంలోనూ ఆ నది ప్రవహిస్తూనే ఉంటుంది. దక్కిన పని కన్నా.. నచ్చిన పని చెయ్‌. ఆనందమైన జీవితాన్ని కొనసాగించు. ఎవరైనా సహాయం కోరితే.. అప్పు చేసి అయినా సహాయపడు. అందులో లభించే ఆనందం అద్వితీయమైనది. బంధువులతో సన్నిహితంగానూ ఉండు; దూరంగానూ ఉండు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలకన్నా.. విలువైనది స్నేహం మాత్రమే. మంచి స్నేహితులను చేర్చుకో. నీదారి చక్కబడుతుంది. ఇవన్నీ.. మా నాన్న నాకు చెప్పకుండా చెప్పినవే. నేను నీకు చెప్పదలచి చెబుతున్నవి. నువ్వు జన్మించిన తర్వాతే నా తండ్రి ప్రేమను, అనురాగాన్ని అప్పుడప్పుడు అర్థం చేసుకోగలిగా. రేపు నీకో కొడుకు పుడితే అప్పుడు నా ప్రేమానురాగాలు అర్థమవుతాయి. రేపు, మరునాడు నువ్వు నీ మనవళ్లతో ఏదో ఒక వూరిలో నవ్వులొలుకుతూ మాట్లాడుతున్నప్పుడు నా జ్ఞాపకం వస్తే.. ఈ లేఖను ఒక్కసారి తీసి చూడు! నీ కంటిలో నుంచి వచ్చే కన్నీటిలో నేనుంటా’’

ఇట్లు..
మీ నాన్న.

NO COMMENTS

LEAVE A REPLY