తెలివిగా దెబ్బేస్తున్న ప్రభుత్వాలు

Posted April 25, 2017 (5 weeks ago) at 17:51

government responsible for petrol price increasingదేశంలో పెట్రోల్‌ ధరలు పెరగడం కొత్త కాదు. కానీ, ముంబై వాసులకు సోమవారం ఊహించనిరీతిలో షాక్‌ తగిలింది. చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్రోల్‌ ధర పెంచకున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే కరువు సెస్సు పేరిట 3 రూపాయలు అదనంగా వడ్డించింది. ఈ దెబ్బకు దేశంలోనే పెట్రోల్‌కు అత్యధిక ధర చెల్లిస్తున్న నగరవాసులుగా ముంబైకర్లు నిలిచారు. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ 68.26 రూపాయలకు లభిస్తుండగా.. అంతకన్నా పది రూపాయలు ఎక్కువగా ముంబైవాసులు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధానిలో లీటరు పెట్రోల్‌ ధర 77.45 రూపాయలకు లభిస్తోంది. ఈ పెట్రోల్‌ వాతపై ముంబై వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ముడిచమురు ధరలు, డాలర్‌-రూపాయి ఎక్స్చేంజ్‌ రేట్లు చూసుకుంటే మార్కెటింగ్‌ చార్జీలు కలుపుకొని చమురు సంస్థలు 29 రూపాయలకే లీటరు పెట్రోల్‌ను డీలర్లకు అందజేస్తున్నాయి. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాదే పన్నులు, సెస్సులతో కలిపి ఈ ధర ఏకంగా 77.50 రూపాయలకు చేరింది. అంటే మార్కెట్‌ ధర కంటే రూ. 47.93 అధికమొత్తాన్ని వినియోగదారులు పన్నులు, సుంకాల రూపంలో చెల్లిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్‌, సెస్సులు, పెట్రోల్‌ బంకు యజమానుల కమిషన్‌ ఉంటుంది. అసలు ధర కన్నా 153శాతం మొత్తాన్ని పన్నుల రూపంలో పెట్రోల్‌ వినియోగదారులపై భారం పడుతోంది.

దాదాపు దేశవ్యాప్తంగా ఇదేరీతిలో పెట్రోల్‌ వినియోగదారులపై పన్నులవాత మోత మోగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో ఉత్పత్తులను ప్రధాన వనరుగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ 72. 66రూపాయలకు లభిస్తోంది. దాదాపు ముంబైరీతిలోనే హైదరాబాద్‌లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వినియోగదారులపై పన్నుల మోత మోగుతోంది. మరోవైపు పెట్రోల్‌ ధర పెరిగిన ప్రతిసారి మధ్య, దిగువ తరగతి జీవులకు మరింతగా ఇబ్బందులు తప్పడం లేదు.

Post Your Coment
Loading...