అద్దె చానల్స్ ఆటలు సాగవిక!

Posted February 13, 2017

govt shocked to rented licence tv channels
స్టుడియో వన్ ప్రసారాలు ఆగిపోయాయా? దాని స్థానంలో ఆశీర్వాద్ గోల్డ్ పేరు ప్రత్యక్షమైందేమిటి ? పూజ టీవీ స్థానంలో సత్కార్ కనిపిస్తున్నదేంటి? ఇవి అద్దె లైసెన్స్ తో నడిచే చానల్స్. చానల్ లైసెన్స్ తీసుకోవాలంటే 20 కోట్ల నెట్ వర్త్ చూపించాలి కాబట్టి అద్దెకు తీసుకుందాంలే అనుకుంటే కుదురుతుందా? ఈ అద్దె చానల్స్ ఆటలు సాగవిక అంటోంది సమాచార ప్రసారాలమంత్రిత్వశాఖ. అలా ఇచ్చిన నోటీసుల ప్రభావం కొత్త సంవత్సరంలో కనబడటం మొదలైంది.

లైసెన్స్ తీసుకొని కూడా చానల్ నడపలేనివారు ఆ లైసెన్స్ అద్దెకివ్వటం ద్వారా నెలవారీ రెండు నుంచి మూడున్నర లక్షల ఆదాయం సంపాదించుకుంటున్నారు. చానల్ నడపకపోతే లైసెన్స్ రద్దవుతుంది కాబట్టి ఇలా ఎవరు అద్దెకు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఎవరూ దొర్క్కపోతే లైసెన్స్ కాపాడుకోవటానికి అతి తక్కువ బాండ్ విడ్త్ లో ప్రసరాలు గాల్లోకి పంపుతుంటారు. తెలుగులో ఇప్పటికీ తులసి, మాయాబజార్ లాంటి చానల్స్ అలాగే ప్రసారాలు పంపుతున్నట్టు నమోదు చేయిస్తూ లైసెన్స్ కాపాడుకుంటూ వచ్చాయి.

మరోవైపు చానల్ పెట్టాలంటే లైసెన్స్ అవసరం లేదనే అభిప్రాయం వచ్చేసింది. ఎవరిదగ్గరినుంచో అద్దెకు తీసుకుని చానల్ పెడుతున్నారు. ఆంధ్రప్రభ సంస్థ వారి యువర్ న్యూస్ ను అద్దెకు తీసుకొని భారత్ టుడే తన చానల్ నడుపుతుండగా వార్త వారి చానల్ తీసుకొని నెంబర్ 1 న్యూస్ చానల్ ప్రారంభించింది. అయితే, లైసెన్స్ పొందిన సంస్థ చేతనే పేరు మార్పుకు దరఖాస్తు చేయించగలిగితే ఈ విషయం బైట పడదు.
అలా కాకుండా.. పేరు మార్పుకు లైసెన్స్ దారుడు ఒప్పుకోకపోతే వాళ్ళ పేరు చిన్నదిగా చూపిస్తూనో, అసలు చూపించకుండానో చానల్స్ నడుపుతున్నవాళ్ళున్నారు. మొదటి విడతగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇలాంటి చానల్స్ ను హెచ్చరిస్తూ నోటీసులు జారీచేసింది. దీంతో లీజుదారులను వాళ్ళు హెచ్చరించారు. జనవరి 1 నుంచి లైసెన్స్ పొందిన చానల్స్ జాబితాలో ఉన్న పేర్లు మాత్రమే టీవీ తెరమీద కనబడాలనే నిబంధన అమలులోకి వచ్చింది

దీని ఫలితంగా ఇంతకాలం కనిపించీ కనిపించకుండా ఉన్న ఆశీర్వాద్ గోల్ద్ పేరు తెరమీద కనిపిస్తూ స్టుడియో వన్ మాయమైంది. సొంత లైసెన్స్ లేని విషయాన్ని పూర్తిగా కప్పిపుచ్చుతూ వచ్చిన 6టీవీ న్యూస్ దిగివచ్చింది. అసలు లైసెన్స్ దారు అయిన ఖోజ్ ఇండియా పేరు పైకెక్కింది. పూజ టీవీ కూడా అనివార్యంగా తన అసలు లైసెన్సు దారుడైన సత్కార్ చానల్ పేరును ప్రధానంగా చూపించక తప్పలేదు. అయితే, రెండో పేరు కనపడకూడదని కూడా ప్రభుత్వం చెబుతుండటంతో లైసెన్స్ దారులు ఆ నిబంధనను కూడా గట్టిగా అమలు పరచే అవకాశాలు కనబడుతున్నాయి.

* MS రెడ్డి 

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY