పాక్ ఉగ్రవాద దేశం కాదా? అమెరికా పాత పాట

Posted October 7, 2016

     india demand america spreading world wide pakistan terrorists country

కొద్దికాలంగా పాకిస్థాన్ కు దూరమవుతూ ఇండియాకు చేరువవుతున్న అమెరికా నుంచి అండదండలు లభిస్తాయన్న ఆశలు భారత ప్రభుత్వంలో ఉన్నాయి. అదే ఊపులో మనపై పదేపదే ఉగ్రదాడులను ప్రేరేపిస్తున్న పాక్ పనిపట్టేందుకు సర్జికల్ స్ట్రైక్సుతో మనమేంటో పాక్ కు రుచి చూపించాం. అంతేకాదు.. అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఏకాకి చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేశాం. చాలాదేశాల నుంచి మనకు మద్దతు దొరికింది. కొన్ని దేశాలైతే భారత్ – పాక్ ల మధ్య యుద్ధమొస్తే మేం భారత్ తరఫున పోరాడుతామని కూడా బహిరంగంగా ప్రకటించాయి. అమెరికా కూడా మన సర్జికల్ స్ట్రయిక్సుకు మద్దతిచ్చింది. అయితే.. తాజగా పాక్ ను ఉగ్రదేశంగా గుర్తించాలన్న భారత్ డిమాండ్ కు మాత్రం అమెరికా నో చెప్పింది. పాకిస్థాన్ ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించలేమని అమెరికా ప్రకటించింది. 

దీంతో అంతర్జాతీయ సమాజంలో పాక్ పై ఉగ్రవాద ముద్ర వేయాలని యత్నించిన భారత్ కు తీవ్ర నిరాశ మిగిలింది. భారత్ – పాకిస్థాన్ లు సమస్యల పరిష్కారం దిశగా అర్థవంతమైన చర్చలు జరపాలని అమెరికా సూచించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నం చేయాలని.. భారత్ కు సమస్యాత్మకంగా మారిన ఉగ్రవాద తండాల ఏరివేత కోసం తాము ఇరు దేశాల ప్రభుత్వాలతో కలసి పని చేస్తామని పాత పాటే పాడింది.

 అణ్వాయుధాలు టెర్రరిస్టులకు చేరకుండా పాకిస్థాన్ అన్ని చర్యలు తీసుకుందని తాము భావిస్తున్నామని అమెరికా పేర్కొంది. అణ్వాయుధాల భద్రత విషయంలో పాక్ జాగ్రత్తగా ఉందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంలో తమ వైఖరి మారలేదని… ఆ సమస్యను రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఎప్పుడూ చెప్పే మాటనే చెప్పుకొచ్చారు. దీంతో అమెరికా నుంచి పాక్ విషయంలో పూర్తి మద్దతు ఉంటుందని భావించిన మన దేశం నిరాశపడాల్సి వచ్చింది. అయితే… ప్రపంచ దేశాల మద్దతుతో సంబంధం లేకుండా పాక్ ను దారిలోకి తెచ్చేందుకు మన దగ్గర వ్యూహాలున్నాయి విదేశాంగ శాఖ వర్గాలు అంటున్నాయి.

Post Your Coment
Loading...