జడ్జిమెంట్ డే

Posted February 14, 2017

judgement day
తమిళనాడు సినిమా క్లైమాక్స్ చేరుకుంది. చిన్నమ్మ భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. అక్రమాస్తుల కేసులో ఇవాళ తీర్పు రానుంది. తీర్పు అనుకూలంగా వస్తుందా.. ? లేక వ్యతిరేకంగా వస్తుందా.. ? అని శశికళ ఆందోళన చెందుతోంది.

నిర్దోషిగా బయటపడితే తమిళనాట శశికళకు తిరుగుండదు. ఆమె ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. గవర్నర్ చిన్నమ్మను ఆహ్వానించక తప్పదు. బలనిరూపణలో ఆమె పాస్ కావడం కూడా లాంఛనమే. ఇక అన్నాడీఎంకేతో పాటు ప్రభుత్వం కూడా శశికళ చేతుల్లోకి వచ్చేసింది.

ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే… శశికళ రాజకీయంగా తెరమరుగైనట్టే. ఎందుకంటే శిక్ష అంటే జైలుకెళ్లడం ఖాయం. అదే జరిగితే ముఖ్యమంత్రి కావడం అనే మాట మరిచిపోవాల్సిందే. ఇక అన్నాడీఎంకేపైనా పట్టు కోల్పోక తప్పదు. ఇక అన్నింటికి మించి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు.

తీర్పు విషయంలో శశికళ అన్ని రకాలుగా ఆలోచన చేస్తోందట. ఈ మేరకు గోల్డెన్ బే రిసార్ట్ లోనే ఎమ్మెల్యేలతో రాత్రంతా మంతనాలు జరిపిందని టాక్. తీర్పు అనుకూలంగా వస్తే ఒకే…. లేకపోతే ఏం చేయాలన్న దానిపై ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే.. సంయమనం పాటించాలని మన్నార్గుడి మాఫియాకు చిన్నమ్మ సూచించిందట. అనవసరంగా లేనిపోనివి చేయొద్దని గట్టిగానే చెప్పిందట. మొత్తానికి ఈరోజు శశికళకే కాదు.. తమిళనాడుకూ ముఖ్యమే. ఎందుకంటే ఈ రోజుతో ముఖ్యమంత్రి ఎవరో క్లారిటీ వచ్చేయనుంది.!! ఆ క్లారిటీ వచ్చే క్షణం కోసమే ఇప్పుడు తమిళ తంబీలు ఎదురు చూస్తున్నారు.

Post Your Coment
Loading...