కాళేశ్వరం ..భారీ కుంభకోణం ?

uttamకాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. రూ.83 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడుతామంటున్నారని, ప్రాజెక్టు నిర్మాణ వాస్తవ వ్యయం రూ.30 వేల కోట్లు అయితే దానిని రూ.83 వేల కోట్లకు పెంచారని ఆయన అన్నారు. లక్షల కోట్ల ప్రాజెక్టులకు డీపీఆర్‌ లేకపోతే ఎలానని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భారీగా అవినీతి జరుగుతోందని అన్నారు.

కోట్లు దండుకోవడానికే ప్రాజెక్టుల అంచనాలు పెంచుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. పనులు ప్రారంభించకముందే మూడు సార్లు అంచనాలు పెంచారని, ఎవడబ్బ సొమ్మని అంచనాలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లన్నీ బోగసేనని, కాంట్రాక్టర్లకు కోట్లు కుమ్మరిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ తప్పులతడకని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.  

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాలు నిగ్గుతేల్చేందుకే తాము ప్రజెంటేషన్ ఇస్తున్నామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రణాళికను రూపొందించింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, 52 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

‘పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారు. ప్రాణహిత డిజైన్ మార్చి తెలంగాణ భవిష్యత్ ను తాకట్టుపెట్టారు. జలం పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కాకిలెక్కలు చెప్పారు. కోటి ఎకరాలకు నీరు అందిస్తామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారు. లక్షా యాభైవేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి దోపిడీకి తెరతీశారు’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.కేసీఆర్ బూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి, సాగునీటి వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నారని ఆరోపించారు.తెలంగాణలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, కుంతియా, టీకాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY