కమల్ ….భలే భలే మగాడివోయ్

 Posted November 2, 2016

Kamal hassan gentel men
మగాడు…ఈ మూడు అక్షరాలూ పుట్టిన వెంటనే నెత్తికి చుట్టుకునే ముళ్లకిరీటం. ఆ మూడక్షరాల మాట నిజం చేయడానికి చచ్చేదాకా పాట్లు…అయినా చివరిదాకా తప్పవు చీవాట్లు .. ఏడిస్తే ఛీ ….చదువురాకపోతే ఛీ …చదువుకునే రోజుల్లో అమ్మాయి పడకపోతే ఫ్రెండ్స్ ఛీ …పడితే ఇంట్లో ఛీ …ఆ రెండూ భరించినా పడిన అమ్మాయికి తగ్గట్టు నడుచుకోకపోతే ఆమె నోటా ఛీ ..చదువవ్వగానే ఉద్యోగం రాకపోతే ఛీ …ఉద్యోగం వచ్చినా పక్కింటోడి కన్నా తక్కువ జీతమొస్తే ఛీ … ఈ ఛీఛీ లు దాటుకుంటూ ఓ ఇంటివాడయ్యాక పెళ్ళాం ఊహల రాజకుమారుడిలా ఉండకపోతే ఛీ .. ఉంటే కన్నోళ్ల ఛీ …అడిగినవన్నీ ఇవ్వకపోతే పుట్టిన పిల్లల ఛీ …ఎలాగోలా సేద దీరుదామని ఆఫీస్ కెళ్తే బాస్ ఛీ …కష్టం మీద బతుకు బండి లాగించి వెనక్కి తిరిగిచూసుకుంటే తన అభిప్రాయాలకు,ఇష్టాలకు ఏ మాత్రం స్థానం లేని జీవితం చూసుకుని తనకే ఛీ ఛీ …అబ్బా బయటికి అంతా సవ్యంగా కనిపించే మగాడి బతుకులో ఎన్ని ఛీ ఛీ లు …వాటన్నిటినీ లోలోనే కప్పెట్టుకుంటూ బయటికి మగ మహారాజు లా బతకడం ఎంత కష్టం ..
మాములుగా వుండే ఈ మగ భారానికి స్టార్ డమ్ తోడైతే …చుట్టూ ఉన్నోళ్లు దేవుడిలా కొలుస్తుంటే…అలా కొలిచిన ప్రియురాళ్లే దగ్గరయ్యాక దూరమై ఛీ ఛీ అంటే …1,2,3 అలా జరుగుతూనే పోతే….అయినా నోరు విప్పకుండా ..కన్నీటి చుక్క కింద రాలకుండా ..కనీసం బయటికి కనపడకుండా ఉండటం ఎంత కష్టం.ఇన్ని జరిగినా ….ఎందరెళ్లినా ఏమి నిలబడ్డావ్ కమల్ ..ప్రపంచవ్యాప్తంగా సర్వేలు చెబుతున్న చేదు నిజం ఒకటుంది..బ్రేక్ అప్ తర్వాత ఆడవారితో పోల్చుకుంటే మగాడికి వేదన ఎక్కువ …కోలుకోడానికి పట్టే సమయం ఎక్కువ ….దీని వెనుక ఓ రీజన్ ఉందండోయ్ ..కుటుంబ జీవితం ఏర్పడ్డాక మగాడి భావోద్వేగ ప్రయాణంలో జీవిత భాగస్వామికి ఫ్రంట్ చైర్ వేస్తాడు. ఆడోళ్లు దాంతో పాటు పుట్టింటి వాళ్ళు,స్నేహితులు ఇలా మరికొంత మందిని స్పేర్ పెట్టుకుంటారు. అవసరానికి ఆ స్పేర్ మనుషులు ఉపయోగపడతారు. మగాడికి ఆ ముందు జాగ్రత్త ఉండదాయే ..అంతా ఆమె అనుకున్నాక …ఆమె అక్కడ లేకపోతే ఏమవుతుంది? శూన్యం .అక్కడి నుంచి ఓ ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పుట్టడానికి …మరిన్ని చీచీల మధ్య మళ్లీ బతకడానికి …సారీ మగాడిలా బతకడానికి ఎంత శక్తి కావాలి? అయినా అన్ని సార్లు నిలబడ్డ నీకు ఎలా లేవాలో మేము చెప్పాలా కమల్ ? ఏమైనా పడిన ప్రతిసారి మళ్లీ లేచిన కమల్ నిజంగా భలే భలే మగాడు ..కదా !

NO COMMENTS

LEAVE A REPLY