నేటి నుంచి బతుకమ్మ సెలవులు…

Posted September 30, 2016

  kcr giving bathukamma festival holidays

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలంతా, ముఖ్యంగా తెలంగాణ మహిళలు ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం నుంచి బతుకమ్మ పండుగ అత్యంత సంతోషకరమైన వాతావరణంలో జరుపుకుంటున్న సందర్భంలో ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ సారి మంచి వర్షాలు కురవడం వల్ల చెరువులన్నీ నిండాయని, గ్రామాల్లో జలకళ ఉట్టిపడడం పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. నిండుకుండలా ఉన్న చెరువులను అందమైన పూలతో నింపి ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ అధికార పండుగను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

మంచి వర్షాలు పడినందున వరుణదేవుడికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి,  ప్రతీ పల్లె పచ్చగా ఉండాలని, ప్రతీ కుటుంబంలో సుఖ శాంతులు వెల్లివిరిసేలా దీవించాలని గౌరమ్మను వేడుకున్నారు.  ఆడపడుచులను పుట్టింటికి తీసుకొచ్చి గౌరవించుకునే అరుదైన సంప్రదాయాన్ని కూడా ఈ పండుగ అందించే గొప్ప సందర్భం అని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి చూపించే బతుకమ్మ పండుగ సందర్భంగా దేవాలయాలు, చెరువుల వద్ద కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుగుణంగా చెరువుల వద్ద భూమిని చదును చేయాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బతుకమ్మల నిమజ్జనం సందర్భంగా కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ నెల 30 నుంచి వచ్చే నెల 12వరకు సెలవులు ప్రకటించింనందున ప్రైవేటు విద్యా సంస్థలు కూడా విధిగా ఈ సెలవులు పాటించాలని కోరారు.

Post Your Coment
Loading...