ఆయనంతే అదో టైపు..

Posted April 11, 2017 (3 weeks ago)

lalloo prasad yadav is differentఆయనకు అక్షరం ముక్క రాదు. కానీ రైల్వే మంత్రిగా రైల్వేల్ని లాభాల పట్టాలపై నడిపించారు. ఐఐటీల్లో కేస్ స్టడీలు పెట్టేలా చేయగలిగారు. అదే చేత్తో పశువుల దాణాలోనూ ఎలా కుంభకోణాలు చేయొచ్చో చాటిచెప్పాడు. ఆయనే సమకాలీన రాజకీయాల్లో సంచలన నేత లాలూ ప్రసాద్ యాదవ్. అవినీతికి లాలూ ఇచ్చిన కొత్త నిర్వచనం చూసి జనం జడుసుకుంటున్నారు. లాలు పుత్రరత్నాలిద్దరూ నితీష్ క్యాబినెంట్లో మంత్రులుగా చక్రం తిప్పుతున్నారు. అయితే వీరిద్దరూ తమకు ఎవరో ఆమ్యామ్యా కింద ఇచ్చిన భూముల్లో మరో వ్యక్తితో పరిశ్రమ నిర్మింపజేయడం రాజకీయ దుమారం రేపుతోంది.

ఆస్తుల అఫిడవిట్లో ఈ పరిశ్రమ భూములు ఎందుకు చూపలేదని బీహార్ ప్రతిపక్ష నేత సుశీల్ కుమార్ మోడీ నిలదీశారు. దీంతో మీడియా లాలూను ప్రశ్నించింది. దీనికి తనదైన స్టైల్లో సమాధానం చెప్పిన లాలూ.. తన కుమారులు పేదరికంలో చనిపోవాలని కోరుకోవడం లేదన్నారు. ఒక్క క్షణం ప్రశ్న అడిగిన జర్నలిస్టుకు మతి పోయింది. తానేం అడిగాడు. లాలూ ఏం చెప్పారు అని. చివరకు వివరణ ఇచ్చిన లాలూ.. పరిశ్రమలు పెట్టి సంపాదించకపోతే.. తన కుమారులు సుఖంగా ఎలా బతుకుతారని గీతోపదేశం చేశారు.

అవినీతి సంగతేంటి మగడా.. అంటే ఆస్తులు పెంచుకోవడానికి అని లాలూ చెప్పాక.. ఏమని రియాక్టవ్వాలో కూడా ప్రత్యర్థులకు అంతుబట్టడం లేదు. బీజేపీ పై వ్యతిరేకతతో నితీష్ తో దశాబ్దాల వైరానికి తెరదించి పొత్తు పెట్టుకున్న లాలూ.. ఈ మధ్యకాలంలో తన కుటుంబానికి ప్రాధాన్యత తగ్గిందని వాపోతున్నారు. మరోవైపు నితీష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. లాలూ ఫ్యామిలీ కారణంగా తన క్లీన్ ఇమేజ్ కు ఎసరు వస్తోందని, అసలు సీఎం తానో, లాలూనో అర్థం కావడం లేదని మథనపడుతున్నారు. పరస్పర అపనమ్మకాలతో నడుస్తున్న సంసారం.. ఈసారి ఎన్నికల్లో ఏం కొంప ముంచుతుందోనని ఆర్జేడీ, జేడీయూ కార్యకర్తలు భయపడుతున్నారు.

Post Your Coment
Loading...