మోడీ వర్సెస్ అద్వానీ!!

Posted December 9, 2016

modi vs advani
బీజేపీ అగ్ర నేత ఎల్.కె. అద్వానీ మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ కోపం వెనక బలమైన కారణాలున్నాయని చెబుతున్నారు. నోట్ల రద్దు అంశం విషయంలో అద్వానీకి కూడా సమాచారం లేదట. ఇంత పెద్ద విషయాన్ని తనకు మాటమాత్రమైనా చెప్పకపోవడంపై ఆయన సీరియస్ గా ఉన్నారట. అసలు ఇలాంటి నిర్ణయమే తప్పని అద్వానీ గట్టిగానే పార్టీ నాయకులకు చెప్పారని సమాచారం.

అద్వానీ కోపం ప్రభుత్వంపై కాదని … మోడీపైనేనని కమలనాథులు అనుకుంటున్నారు. పలు అంశాల్లో ఆయన మోడీతో విభేదిస్తున్నారు. ఎన్నికలకు ముందు అంటే మోడీ హవా పార్టీలో మొదలైనప్పటి నుంచి అద్వానీ … బీజేపీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కడా ఆయన ప్రస్తావన ఉండడం లేదు. ఆయన కూడా నామ్ కే వాస్తేగా వచ్చి పోతున్నారు. మోడీతో పలు సమావేశాల్లో పాల్గొంటున్నా అది అప్పటివరకే. ముఖ్యంగా మోడీ అభ్యర్థిత్వం విషయంలోనూ అద్వానీ అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతుంటారు. పీఎం క్యాండిడేట్ గా సుష్మాను తెరపైకి తెచ్చారట అద్వానీ. కానీ మోడీ ప్రభంజనంలో సుష్మా పేరు వెనక్కు వెళ్లిపోయింది. పార్టీ నాయకులంతా మోడీకే సపోర్ట్ చేశారు.

ఒక వ్యక్తి చుట్టూ రాజకీయాలు తిరగడం బీజేపీలో ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు బీజేపీలో మోడీ చుట్టే అంతా నడుస్తోంది. ఎన్నికల తర్వాత అయినా మోడీ మారుతారని అద్వానీ ఆశించారట. కానీ ఆయన ప్రధాని అయ్యాక ఇది మరింత పెరిగింది. పార్టీ నాయకులంతా మోడీ భజనలోనే మునిగిపోవడం ఆయనకు ఏమాత్రం నచ్చడం లేదట. ఇక నోట్ల రద్దు అంశంలోనూ ఏదో అద్భుతం జరిగిపోయిదంటూ పార్టీ నాయకులంతా చెప్పడం… ప్రజలంతా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే… ఈ మోడీ జపం ఏంటని ఆయన అసహనంగా ఉన్నారట. ఆ అసహనమే పార్లమెంటులో బయటపడిందని చెబుతున్నారు.

ఈ విషయం మోడీకి తెలిసినా.. ఆయన లైట్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మోడీ వర్సెస్ అద్వానీ వార్ మాత్రం ఇలాగే కొనసాగితే బీజేపీకే మంచిది కాదంటున్నారు విశ్లేషకులు.

Post Your Coment
Loading...