బీజేపీ సీఎంలకు మోడీ వార్నింగ్

Posted April 24, 2017 at 10:14

modi warning to bjp chief ministersదేశంలో పదమూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అంటే పదమూడు మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వీరిలో ఎవరు సమర్థులు, ఎవరు అసమర్థులు అనే లెక్క అమిత్ షా దగ్గరుంది. ఎప్పటికప్పుడు వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తున్న అమిత్ షా.. నీతి అయోగ్ మీటింగ్ కు వచ్చిన బీజేపీ సీఎంలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత రావద్దని, దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అటు ప్రధాని మోడీ కూడా రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తే.. కేంద్రంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారట.

నీతి అయోగ్ భేటీ తర్వాత బీజేపీ సీఎంలతో మోడీ, షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న సీఎంలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్ లో అఖండ విజయం సాధిస్తామని ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ చెప్పగా… తమకు మరిన్ని నిధులివ్వాలని మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ సీఎంలు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అధికారం చేజారకూడదని, ఎప్పటికప్పుడు ప్రజాదరణ పెంచుకోవాలని సీఎంలకు సూచించారు.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ తో ప్రత్యేకంగా భేటీ అయిన అమిత్ షా.. శివసేనతో సంబంధం లేకుండా రాష్ట్రంలో పార్టీని విస్తరించాలని సూచించారు. ఇందుకోసం ఎవరేమనుకున్నా లెక్కచేయాల్సిన అవసరం లేదని కూడా కుండబద్దలు కొట్టారట. దీంతో ఇప్పుడు శివసేన ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దేశమంతా కాషాయమయం చేయాలని కలలు కంటున్న మోడీ, షా, కొత్త రాష్ట్రాల్లో పాగా వేస్తూనే.. ఉన్న రాష్ట్రాలను కోల్పోకూడదని సీఎంలకు దిశానిర్దేశం చేశారు.

Post Your Coment
Loading...