ఎన్ కౌంటర్ లో నయీమ్ హతం…

0
163

nayeem encounteredగ్రే హౌండ్స్ పోలీసుల చేతుల్లో గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమయ్యాడు షాద్ నగర్ వద్ద జరిగిన ఈ యెన్ కౌంటర్ సంచలనం రేపింది .

ఎవరీ నయీమ్ ..
నయీం..అలియాస్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. గ్యాంగ్‌ స్టర్‌గా మారిన మాజీ నక్సలైట్‌. అతని పేరు వింటే చాలు.. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి అడవిలో అన్నల వరకు ఉలిక్కి పడతారు. నయీం కనబడడు.. కానీ పేరు మాత్రమే వినబడుతుంది.. మిగిలిన పనంతా కిందవాళ్లు చూసుకుంటారు. హత్యలైనా.. బెదిరింపులైనా అంతా పద్ధతి ప్రకారం చేసుకుపోయాడు నయీం. ఇప్పటికే 40కి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్‌మెంట్లను తన ఖాతాలో వేసుకుని ఉమ్మడి రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన మాజీ నక్సలైట్, ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాడు నయీం. ఏళ్లుగా పరారీలోనే నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారాడు.

నక్సలైట్ నుంచి కోవర్టుగా
నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్‌లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేసి వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించిన నయీం, ఆ తరవాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు! దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలను కూడా నిర్వహించాడు. ఈ పరిణామ క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. మావోయిస్టుగా పని చేసినప్పుడు గ్రేహౌండ్స్ డీఐజీ వ్యాస్‌ను నడిరోడ్డుపై కాల్చి చంపిన కేసులో నయీం ప్రధాన నిందితుడు. భువనగిరిలో బెల్లి లలిత హత్యతో మొదలు పెట్టి వందకుపైగా దారుణ హత్యలతో సమాజానికి సవాల్‌ విసిరాడు.సంచలనాత్మక హత్యలు జరిగిన ప్రతిసారీ నయీం పేరే వినిపించేది. కానీ అతన్ని పట్టుకోవడంలో పోలీసులు ప్రతీసారి విఫలమయ్యారు. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్‌కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారంటారు.

ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం
కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి చేతిలో ‘ఆయుధం’గా కూడా మారాడు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకుంటారని వినిడికి. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు. నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడయినా తెలియలేదు. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కొందరు ఉన్నతాధికారుల మద్దతే ఇందుకు కారణమని తెలుస్తోంది.

దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్
నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. గ్రేహౌండ్స్‌కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులోనూ ఇతను నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తరవాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్‌లను పట్టపగలే తెగనరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర సుస్పష్టం. మరో నేత ఆజం అలీనీ చంపినట్లు ఆరోపణలున్నాయి. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్‌మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్‌బీ నగర్‌కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత, టీఆర్‌ఎస్ నాయకుడు కె.సాంబశివుడు, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి… ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

బయటి ప్రపంచానికి తెలియకుండా
నయీం నేరాలు చేయించే స్టైల్, ఆ తరవాత సదరు నిందితులు అరెస్టయ్యే విధానం మోడస్ అపరండీ పక్కాగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్‌లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నేరాలకు పాల్పడేది ఒకరైతే, 48 గంటల్లోనే లొంగిపోయే వారు మరొకరు! అందుకే ఏ కేసులోనూ నయీం వ్యవహారం పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు. మాజీ నక్సలైట్లు, మావోయిస్టులనే టార్గెట్‌గా చేసుకున్న నయీంకు పొలిటికల్‌ సపోర్ట్ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు కొందరు నయీంకి సహకరించారన్న విమర్శలూ లేకపోలేదు.

NO COMMENTS

LEAVE A REPLY