పవన్ ,జగన్ మాయా యుద్ధం?

Posted November 16, 2016 (4 weeks ago)


పురాణాలు,జానపద కధల్లో చాలా చోట్ల మాయా యుద్ధ ప్రస్తావన కనిపిస్తుంది.బయటికి కనపడకుండా శత్రువు మీద ఆయుధ ప్రయోగం ఈ యుద్ధ ప్రత్యేకత. ఇప్పుడు జనసేన అధినేత పవన్ మీద వైసీపీ అధినేత ఇదే యుద్ధం చేస్తున్నారు.అయితే ఈ యుద్ధ ఉద్దేశం శత్రువుని భయపెట్టి తనతో కలిసేలా చేయడం.ఇప్పటికే సాక్షి సహా మరికొందరు యోధుల సాయంతో చురుగ్గా సాగిస్తున్నారు జగన్.అందుకు సాక్ష్యమే కొన్ని ఉదంతాలు …

1 . వైసీపీ కీలక నేత,ఎంపీ విజయసాయిరెడ్డి పదేపదే హోదా పోరాటంలో పవన్ మాతో కలిసి పనిచేయాలని పిలుపివ్వడం అందరికీ తెలిసిందే
2 . తిక్కెక్కిస్తున్న పవన్ లెక్క ..అంటూ సాక్షి ఛానల్ లో కీలక బాధ్యతలు వహిస్తున్న అమర్ సాక్షి పత్రికలో రాసిన వ్యాసంలో ఆద్యంతం పవన్ వ్యవహారశైలిని,రాజకీయ వైఖరిని తూర్పారబట్టారు.అదే వ్యాసం ముగింపుకి వచ్చేసరికి ప్రతిపక్షాలతో కలిసి పని చేస్తే ప్రజలు పవన్ ని నమ్ముతారని ముక్తాయింపు.ఓ రకంగా విజయసాయిరెడ్డి విన్నపానికి జర్నలిస్టిక్ కోటింగ్ ఆ వ్యాసం.
3 . ఇక పవన్ ప్యాకేజ్ తీసుకుని టీడీపీ కి అనుకూలంగా పని చేస్తున్నారని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ చేసిన ఆరోపణలకు సాక్షి పెద్ద పీట వేసింది.

ఇవన్నీ పవన్ మీద జగన్ చేస్తున్న మాయాయుద్ధానికి చిన్నచిన్న ఉదాహరణలు మాత్రమే.కాపు ప్రతినిధిగా ముద్రగడని ఫోకస్ చేసి పవన్ ని దెబ్బ కొట్టేందుకు పరోక్షంగా ఎంత చేయాలో అంతా చేస్తోంది వైసీపీ.

అటు పవన్ కూడా ఇదే అస్త్రం ప్రయోగిస్తున్నారు.నేరుగా వైసీపీ,జగన్ ప్రస్తావన లేకుండా ప్రజాసమస్యలపై పోరాటంలో ప్రధాన ప్రతిపక్షానికి ఎసరు పెడుతున్నారు.వైసీపీ పెద్ద ఎత్తున రాజకీయ లబ్ది పొందాలనుకున్న ప్రతిసారి తానే ముందుకు వెళ్లి దాని తీవ్రత తగ్గిస్తున్నారు.జగన్ కన్నా పవన్ ముందు అని …జగన్ రాజకీయం చేస్తుంటే పవన్ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని ఓ ఇంప్రెషన్ కలగజేస్తున్నారు.ఏదేమైనా ఆధునిక రాజకీయపోరులోనూ సమర్ధంగా మాయా యుద్ధం చేస్తున్నారు పవన్ ,జగన్.ఫలితమేంటో చూడాలంటే 2019 దాకా ఆగాల్సిందే.

 

NO COMMENTS

LEAVE A REPLY