నేడే కామదా ఏకాదశి..పూజా విధానం

Posted April 7, 2017 (3 weeks ago)

puja procedure for kamada ekadasi
స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరమే అయినా … దేవాలయమే అయినా వాళ్లు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు .. వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా ‘కామదా ఏకాదశి వ్రతం’ కనిపిస్తుంది.

చైత్ర శుద్ధ ఏకాదశి రోజునే ‘కామదా ఏకాదశి’ అని … ‘దమన ఏకాదశి’ అని పిలుస్తుంటారు. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం … జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.

కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఓ గంధర్వుడు శాపం కారణంగా తన భార్యకు దూరమై, రాక్షసుడి రూపంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన భర్తను ఆ స్థితి నుంచి బయటపడేయడం కోసం ఆ గంధర్వ స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది.

వ్రత ఫలితం వలన ఆ గంధర్వుడుకి శాప విమోచనం కలిగి తన భార్యను చేరుకుంటాడు. భార్యా భర్తలు ఎలాంటి పరిస్థితుల్లోను విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉంది. అందుకే చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణుల ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఈరోజునే శ్రీకృష్ణునిని ఆందోళికోత్సవము జరుపుతారు. ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి. కృష్ణ ప్రతిమగల ఉయ్యాలను ఊచితే, వేయి అపరాధాలైనా క్షమింపబడతాయి, కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంతమునందు విష్ణు సాయుజ్యము లభించగలదు.

Post Your Coment
Loading...