ఆ మూడు త‌ప్పులే కొంప‌ముంచాయా?

Posted February 12, 2017

seshikala 3 mistakes in her political life
జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత అంతా స‌వ్యంగా సాగిపోతున్న త‌రుణంలో శ‌శిక‌ళ అన‌వ‌స‌రంగా క‌ష్టాల‌ను కొని తెచ్చుకున్నారు. తానే క‌ష్టాల‌కు ఎదురెళ్లి ఇప్పుడు ఫ‌లితం అనుభ‌విస్తున్నారు. ముఖ్య‌మంత్రి కావ‌డం లాంఛ‌నమే అనుకున్న త‌రుణం నుంచి… ఇప్పుడు సీఎం అభ్య‌ర్థిగా మరొక‌రిని చిన్న‌మ్మే వేరొక‌రిని తెరపైకి తేవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇది ఆమె స్వ‌యంకృతాప‌రాధ‌మేన‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

నిజానికి శ‌శిక‌ళ చేసిన 3 త‌ప్పులే ఆమె కొంప‌ముంచాయి. పార‌ద‌ర్శ‌క‌త లోపించ‌డం… దూకుడు.. స‌రైన వ్యూహ‌ర‌చ‌న చేయ‌లేక‌పోవ‌డం… ఈ మూడు త‌ప్పులే ఇప్పుడే ఆమెను సీఎం సీటుకు దూరంగా తీసుకెళ్తున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

చిన్న‌మ్మ చేసిన తొలి త‌ప్పు పార‌ద‌ర్శ‌క‌త‌ను పాటించ‌క‌పోవ‌డం. ఆమె మొద‌టి నుంచి ఏది చేసిన ర‌హ‌స్యంగానే చేసింది. జ‌య వెన‌కాల ఉండి ర‌హ‌స్యంగానే ప‌నుల‌ను చ‌క్క‌బెట్టింది. చివ‌ర‌కు అమ్మ ఆస్ప‌త్రి పాలైన‌ప్పుడు కూడా ఆమె ర‌హ‌స్యాన్నికొన‌సాగించింది. జ‌య అనారోగ్యంపై ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు కానీ.. చికిత్స విష‌యంలో క్లారిటీ కానీ ఇవ్వ‌లేదు. దీంతో జ‌య మ‌ర‌ణంపై ఇప్పుడు లేనిపోని అనుమానాల‌కు తావిచ్చ‌న‌ట్ట‌య్యింది. అంతేకాదు కోర్టులు జ‌య మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక జ‌య మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందు ఎమ్మెల్యేలతో శ‌శిక‌ళ తెల్ల‌కాగితాల‌పై సంత‌కాలు తీసుకున్నార‌ట‌. ఇవ‌న్నీ ఆమెపై వ్య‌తిరేక‌త‌ను పెంచాయి.

శశికళ రెండో తప్పు. దూకుడు. ఇదే పాలిట శాప‌మైంది. ప్ర‌తి విష‌యంలోనూ ర‌హ‌స్యాన్ని పాటించే ఆమెకు తొంద‌ర‌పాటు చాలా ఎక్కువ‌. రాజకీయాల్లో లాంట్ ఇన్నింగ్స్ ఆడాల‌నుకుంటే ఓపిక, సహనం చాలా ముఖ్యం. అధికారం కోసం గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు కూడా వేచిచూసేంద ఓపిక ఆమెకు లేదు. ఏదైనా అప్ప‌టిక‌ప్పుడు జ‌రిగిపోవాలి. రాత్రికి రాత్రే ఆమె ముఖ్య‌మంత్రి అయిపోవాలి. ఇదే ఆలోచ‌న త‌ప్ప దూకుడు త‌గ్గించి .. లేటైనా మంచి నిర్ణ‌యం తీసుకుందాన్న ఆలోచ‌న లేదు.

చిన్న‌మ్మ చేసిన మూడో తప్పు. అతి పెద్ద‌ది. అదే స‌రైన వ్యూహం లేక‌పోవ‌డం. పార్టీపై ప‌ట్టు కోసం ప్రధాన కార్యదర్శి కావాలనుకుంది. అయిపోయింది. అది అంతా సాఫీగా జ‌రిగిపోవ‌డం సీఎం కుర్చీ కూడా త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తుంద‌ని చిన్న‌మ్మ ఆశించింది. కానీ ఒక‌వేళ ప‌రిస్థితులు క‌లిసిరాక‌పోతే ఏం చేయాల‌న్న దానిపై స‌రైన వ్యూహ ర‌చ‌న చేయ‌లేక‌పోయింది. కేంద్రం… డీఎంకే.. జ‌నం…అన్నింటికి మించి ప‌న్నీర్ సెల్వం త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్నా… ఎమ్మెల్యేలు త‌న ద‌గ్గ‌రే ఉన్నారు… క్యాంపు పాలిటిక్స్ లో చిటికెలో మెజార్టీ నిరూపించుకోవ‌చ్చ‌ని అనుకుంది. అంతేత‌ప్ప ఒక‌వేళ గ‌వ‌ర్న‌ర్ త‌నకు అవ‌కాశం ఇవ్వ‌క‌పోతే ఏం చేయాలి… కేంద్రం అంత ఈజీగా త‌న‌ను వ‌దిలేస్తుందా… అక్ర‌మాస్తుల కేసు నుంచి త‌ప్పించుకోవ‌డం ఈజీయేనా… ప‌న్నీర్ సెల్వం తిరుగుబాటు చేస్తే ఏం చేయాలి…. అని ఆలోచించ‌లేక‌పోయింది.

ఈ త‌ప్పుల ఫలిత‌మే ఇప్పుడు శ‌శిక‌ళ అనుభ‌విస్తోంది. ప‌క్క‌నే ఉన్న సీఎం కుర్చీ… ఇప్పుడు అంద‌నంత దూరానికి ప‌రుగెత్తి పోతుండ‌డంతో ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. దీంతో చిన్న‌మ్మ టెన్ష‌న్ లో ఏదేదో చేసేస్తోంది. ఫ‌లితంగానే మీడియాకు గంట‌గంట‌కు ఒక్కో ర‌క‌మైన లీకులు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికైనా ఈ దూకుడు త‌గ్గించుకొని.. కొంతైనా ఆలోచిస్తే.. ఏమైనా ఫ‌లితం ఉంటుంది… లేక‌పోతే శ‌శిక‌ళ క‌ష్టాలు పెరుగుతాయే త‌ప్ప త‌గ్గ‌వంటున్నారు విశ్లేష‌కులు.

Post Your Coment
Loading...