నడిపించు నా నావా.. నడిసంద్రమున దేవా

Posted May 1, 2017 (4 weeks ago) at 10:00

tamilnadu politics in confusionతమిళనాట అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అమ్మ ఆత్మ చెప్పిందంటూ పన్నీర్ సెల్వం.. చిన్నమ్మ చెప్పిందంటూ పళనిస్వామి రాజకీయాలు చేస్తూ.. చివరకు అసలైన అన్నాడీఎంకే పార్టీ గుర్తుతో పాటు పేరు కూడా అంతర్థానమైపోయింది. కానీ జయలలిత పేరు చెప్పుకుని రెండు కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇక జయ నెచ్చెలిగా చక్రం తిప్పాలన్న శశికళ ఆశలు జైలుకు వెళ్లడంతో కల్లలయ్యాయి. ఆమె ప్రతిష్ఠించిన ఉత్సవ విగ్రహం దినకరన్ కూడా కస్టడీలోనే ఉన్నాడు.

ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీకి అర్జెంట్ గా జయలలిత లాంటి మాస్ లీడర్ కావాలి. పన్నీర్, పళని ఇద్దరూ మాస్ లీడర్లు కాదు. పార్టీని నడిపించే సత్తా అసలు లేదు. త్వరలోనే రాష్ట్ర పర్యటన చేస్తానని చెప్పిన పన్నీర్.. ఆ దిశగా ముందుకు కదలకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. పళని బలపరీక్ష తర్వాత వెంటనే పన్నీర్ ప్రజల్లోకి వెళ్లి ఆయన చెప్పాల్సింది చెప్పుంటే.. ఆయనకు ఎంతో కొంత మాస్ లీడర్ గా ఎదిగే అవకాశం ఉండేది. కానీ పన్నీర్ కేవలం అంతఃపుర రాజకీయాలు చేయడం కొంతమంది ఆయన అనుచరులకు కూడా రుచించడం లేదు.

ఇక పళనిస్వామి. ఈయన పేరుకే సీఎం. చక్రం తిప్పేదంతా మన్నార్ గుడి మాఫియానే. స్వతంత్రంగా ఒక్క నిర్ణయం తీసుకోలేకపోతున్న పళనిస్వామి సీఎంగా ఉన్నా.. లేకున్నా ఒరిగేదేమీ లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు అన్నాడీఎంకే భవిష్యత్ ఏంటని పార్టీ శ్రేణులు మథన పడుతున్నాయి. విలీన చర్చల్ని సాగదీస్తున్న ఇరువర్గాలు చేజేతులా స్టాలిన్ కు అవకాశం ఇస్తున్నారు. జయ మరణం, కరుణ అనారోగ్యంతో.. మిగిలిన ఏకైక మాస్ లీడర్ స్టాలినే. అందుకే ప్రజలు కూడా ఆ దిశగా దృష్టి సారించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

Post Your Coment
Loading...