నయీమ్ గుట్టును సిబిఐ తో తవ్వించండి ..

0
63

 telangana politicians demand gangster nayeem case giving cbiసంచలనం సృష్టిస్తోన్న వ్యవహారంలో అధికారపార్టీ పెద్దలు ఉన్నారన్న వార్తలు సిట్ విచారణపై అనుమానాలకు తెరలేపుతున్నాయి. విచారణను సీబీఐకి అప్పగిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు సైతం ఇదే డిమాండ్‌ను తెరపైకి తీసుకువస్తున్నాయి. అన్ని పార్టీలు సీబీఐ విచారణకు పట్టుపడుతున్నాయి. నయీం ఘోరాలు ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా ఏపి, కర్నాటక, ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌కూ విస్తరించినందున, కేసును సీబీఐకి అప్పగించడమే సబబన్న వాదన తెరపైకి వస్తోంది.

ప్రస్తుతం తెరాసలో ఉన్న మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు నయిం కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే నయిం ఎవరెవరితో సంబంధాలున్నాయన్న దానిపై పేర్లతో సహా చర్చ జరుగుతోంది. అందులో ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ల నుంచి టీఆర్ ఎస్, కాంగ్రెస్, తెదేపా నేతల వరకూ ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, అందులో చోటు చేసుకున్న వారంతా ఒక్కొక్కరు బయటకు వచ్చి, నయీంతో తమకెలాంటి సంబంధాలు లేవని మీడియాకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఎ మ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఒకడుగు ముందుకేసి, తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై విచారణ జరపాలని ఫిర్యాదు చేసేంతవరకూ వెళ్లారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, మరో పోలీసు అధికారి శివశంకర్‌రెడ్డి కూడా స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి తమకు నయీంతో ఎలాంటి సంబంధాలు లేవని వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్న ఐపిఎస్ అధికారుల పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ మారిన ఒక ఎమ్మెల్సీ తొలి నుంచీ బినామీగా ఉన్నారని, ఆయనను కొద్దిసేపట్లో అరెస్టు చేయనున్నారంటూ చానెళ్లలో గత రెండురోజుల క్రితం వచ్చిన వార్తలు తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. సోషల్ మీడియాలో వస్తున్న పేర్లలో ఐపిఎస్ ప్రముఖులు కూడా ఉండటంతో వారి విచారణ తీరుపైనా అప్పుడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ అధికారులు సీనియర్ ఐపిఎస్ అధికారులను విచారించేంత ధైర్యం చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌కౌంటర్ నుంచి అతని బినామీ ఆస్తులు, అతని వెనుక ఉన్న అదృశ్య శక్తులు, వాడుకున్న ప్రముఖుల పేర్లు బయటకు రావాలంటే సీబీఐ విచారణే సరైనదన్న అభిప్రాయం సాధారణ ప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది.

చెట్టపట్టాల్ వేసుకున్న వారిలో ఎక్కువమంది అధికారపార్టీ ప్రముఖులే ఉండటంతో, వారిని ప్రశ్నించి నిజాలు రాబడితే అధికారపార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే విచారణ అంతా లీకులతోనే సరిపోతోందని, ఒకసారి డాక్యుమెంట్లలో అందరి పేర్లు ఉన్నాయని, మరొకసారి కోడ్ భాషలో ఉన్నాయని, అందరి ఫోన్లను రికార్డు చేశారని లీకులు ఇస్తున్నారే తప్ప, వారి పేర్లు ఇంతవరకూ బయటపెట్టకపోవడం వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది. కేవలం మావోయిస్టులను హతమార్చేందుకే వాడుకున్నారా? లేక దానిపేరు చెప్పి ఇతర మార్గాలు పట్టారా? పోలీసులతో సన్నిహితంగా మెలిగిన నయీం దానిని అడ్డుపెట్టుకుని ఎంత సంపాదించారు? ఆ క్రమంలో ఎవరెవరిని బెదిరించారు? అందులో పోలీసులు, రాజకీయ నాయకుల పాత్ర ఎంత? నిజంగా నరుూం డంపులలో ఉన్నది ఎంత? బయటకొస్తున్నది ఎంత? అన్నది తేలాలంటే సీబీఐ విచారణే సరైదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా ఎంసెట్ లీకు కేసులో ఒక డీఎస్పీ స్థాయి అధికారే విచారణకు వెళ్లి నిందితుడి దగ్గర మూడు లక్షల లంచం తీసుకున్నారంటే, వందలకోట్ల సంపద ఉందన్న ప్రచారం జరుగుతోన్న నయూం వద్ద ఉన్న సొమ్ము సంగతేమిటన్న సందేహాలు తెరపైకొస్తున్నాయి.మరో వైపు నయిం ఎక్కడెక్కడ ఏయే ఆస్తులు సంపాదించారని చెబుతున్నారే తప్ప, పోలీసు ఉన్నతాధికారులెవరున్నారన్నది ఇప్పటివరకూ సూచనప్రాయంగా కూడా లీక్ చేయకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ నేతల పేర్లు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి….

NO COMMENTS

LEAVE A REPLY