టీబీజేపీని డామినేట్ చేస్తున్న టీఆర్ఎస్!!

Posted February 10, 2017 (3 weeks ago)

telangana trs dominating telangana bjpకేంద్రప్రభుత్వం ఏదైనా తెలంగాణకు మంజూరు చేస్తే… ఆ క్రెడిట్ తీసుకునే హక్కు బీజేపీకి ఉంటుంది. కానీ టీబీజేపీ నేతలు ఆ క్రెడిట్ తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ మాత్రం దాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకొని.. ఆ క్రెడిట్ ను కొట్టేస్తోంది. తాజాగా కేంద్రం ఎయిమ్స్ ను ప్రకటిస్తే… అది కూడా తమ చలవేనని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్.

కేంద్రప్రభుత్వం ఎయిమ్స్ ను ప్రకటిస్తే.. దానికి టీఆర్ఎస్ రియాక్షన్ వేరేలా ఉంది. ఎయిమ్స్ ను పోరాడి సాధించుకున్నామని చెప్పుకొచ్చారు గులాబీ నేతలు. ఎంపీలైతే మరో అడుగు ముందుకేసి.. తెలంగాణకు ఏది కావాలన్నా పోరాటం చేస్తేనే వస్తోందని కేంద్రానికి చురకలంటించారు. తమ పోరాటం ద్వారానే ఎయిమ్స్ వచ్చిందంటూ… ఆ క్రెడిట్ ను కొట్టేయడంలో సక్సెస్ అయ్యింది టీఆర్ఎస్.

ఎయిమ్స్ క్రెడిట్ ను టీఆర్ఎస్ అకౌంట్లో వేసుకుంటే.. టీబీజేపీ మాత్రం చూస్తూ ఉండిపోయింది. కేంద్ర ప్రకటన రాగానే.. ఇది మావల్లే సాధ్యమైందని కనీసం మాటమాత్రమైనా చెప్పలేకపోయారు కమలనాథులు. టీబీజేపీ నేతల అగ్రనేతల మొద్దునిద్ర వల్లే ఇలా జరుగుతోందని కమలం క్యాడర్ ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు.

ఒకవైపు కేంద్రం నుంచి ఎన్ని నిధులొచ్చినా.. టీబీజేపీ మాత్రం ఆ క్రెడిట్ ను తీసుకోలేకపోయింది. కనీసం ఎయిమ్స్ విషయంలోనైనా క్రెడిట్ తీసుకుంటే.. కొంతైనా లబ్ధి జరిగేది. అదే సమయంలో టీఆర్ఎస్ మాత్రం ప్రతి విషయంలోనూ తమ లాభాన్ని చూసుకుంటోంది. ఏమాత్రం అవకాశమున్నా.. క్రెడిట్ ను కొట్టేసి.. ప్రజల దృష్టిలో ఇమేజ్ ను పెంచుకుంటోంది. కనీసం టీఆర్ఎస్ ను చూసైనా.. టీబీజేపీ నేతలు మారాలని కమలం క్యాడర్ చెబుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY