టాలీవుడ్ లో ఇక ట్రయాంగిల్ ఫైట్..?

 tollywood triangle top position

టాలీవుడ్ టాప్ చెయిర్ కోసం ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఢీ కొట్టారు. ఆ చెయిర్ ఇద్దరితోనూ దోబూచులాడింది. ఒకరు భారీ హిట్ కొట్టి సెటిల్ అయ్యేంతలో ప్లాఫ్ పలకరించేది. పవన్, మహేష్ ఇద్దరికీ అవే అనుభవాలు ఎదురయ్యాయి. ఎవరూ కుదురుగా టాప్ చెయిర్ లో సుదీర్ఘ కాలం కూర్చోలేకపోయారు. ఇంతలో పవన్ రాజకీయ రంగం పైనా కన్నేశారు, కానీ సినిమాలను వదలబోనని తిరుపతి సభాముఖంగా ప్రకటించారు. అంటే పోటీతప్పదన్న సంకేతాలు ఇచ్చేశారు. అయితే ఈ రేసులోకి దూసుకొచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్…

20 ఏళ్ళ వయసులోనే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ తో మెగాస్టార్ చిరంజీవినే ఢీ కొట్టిన ఎన్టీఆర్ తర్వాత కాలంలో ఆ జోరు కొనసాగించలేకపోయాడు. వరస వైఫల్యాలు ఎన్టీఆర్ లో సరికొత్త ఆలోచనలకి దారితీశాయి. ఒకప్పుడు మాస్ కే పరిమితమైన ఎన్టీఆర్ తాను మారి క్లాస్,మాస్ అన్న తేడాను చెరిపేసి అందరివాడిగా నిలబడేందుకు ప్రయత్నించారు.. ఆక్రమంలోను కొన్ని ఒడిదుడుకులు తప్పలేదు. అయినా ప్రయత్నాలు ఆగలేదు.చివరిగా అనుకున్న ఫలితం దరిచేరింది. 50 కోట్ల మార్క్ కోసం తెగ కష్టపడ్డ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో మంచి సినిమా పడితే తన రేంజ్ ఏమిటో చూపించాడు. టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతా గ్యారేజ్.. మూడు వరుస హిట్లతో టాలీవుడ్ సింహాసనం రేసులో ముందుకొచ్చాడు… ఒక్క సినిమాతోనే అంత స్థానం దక్కుతుందా అని సందేహపడేవాళ్ళకి జనతా గ్యారేజ్ లెక్కలు మతిపోగొడుతున్నాయి.

ఒకప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ సైతం షారుఖ్,అమీర్ ని ఎదుర్కోవడానికి నానాకష్టాలుపడ్డాడు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొని దబాంగ్ తర్వాత ఆ ఇద్దరికీ సవాల్ మీద సవాల్ విసురుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ కూడా ట్రాక్ లో పడ్డాడు. అంటే టాలీవుడ్ టాప్ చెయిర్ కోసం ట్రయాంగిల్ ఫైట్ మొదలైనట్టే .. అందులో ఎవరు నెగ్గుతారో.? ఎవరు తగ్గుతారో కాలమే సమాధానం చెప్పాలి…

Post Your Coment
Loading...